జైల్లో పెడితే.. యోగా చేసి బయటికొస్తా..: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
తనపై కేసులు పెట్టేందుకు సిద్ధమైందంటూ తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.
ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. జైలుకెళ్లేందుకైనా తాను సిద్ధమని అన్నారు. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతానని చెప్పారు. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని, ఆ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్‌ను ఖతం చేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.

తనను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు కేటీఆర్. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కుంటానని అన్నారు. విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఫార్ములా 1 రేసింగ్ ను నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడతాయని, అయితే, దాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ కు మొగ్గు చూపామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించాలని 2003లోనే చంద్రబాబు ఆశించారని, కానీ, నిర్వాహకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సాధ్యం కాలేదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మళ్లీ తాను వాళ్లతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహించే ఫార్ములా ఈ కారు రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ చేసిన కుంభకోణాలు గుర్తుకువస్తాయని కేటీఆర్ విమర్శించారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని కేటీఆర్ గుర్తు చేశారు. ఓ మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే.. దానిపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రేసు రద్దు చేసినందుకు రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖలపై కేసు పెట్టాలన్నారు. తాము హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే.. రేవంత్ రెడ్డి బ్యాట్ ఇమేజ్ తెస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు వల్ల 800 కోట్ల నష్టం వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.
మేఘా కృష్ణారెడ్డి ఇంటికి ఏసీబీని పంపే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. సుంకిశాల ఘటనలో అవినీతి కేసు పెట్టాల్సి వస్తే కృష్ణారెడ్డిపై పెట్టాలన్నారు. రూ. 80 కోట్లు నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. అంతమేర ప్రభుత్వానికి నష్టం చేసిన మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టే దుమ్ముందా? అని రేవంత్ సర్కారును కేటీఆర్ నిలదీశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకూ వదిలిపెట్టమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications