ప్రయోగాల ధృవతార సింగీతం శ్రీనివాసరావు అస్తమయం.. శోకసంద్రంలో సినీ లోకం!
భారతీయ చలనచిత్ర ప్రపంచంలో వినూత్న ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన అరుదైన సినీ దిగ్గజం, సృజనాత్మక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (95) ఇకలేరు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వయసు తొంబై దాటినా ఆయనలోని సృజనాత్మక తృష్ణ కొంచెమైనా తగ్గలేదు.
ఇటీవల నాగ్ అశ్విన్ నిర్మాణంలో 'సింగీతం' అనే చిత్రాన్ని తెరకెక్కించి, 94 ఏళ్ల వయసులోనూ మెగాఫోన్ పట్టిన ప్రపంచంలోనే అత్యంత వయోధికుడైన దర్శకుడిగా అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన మృతితో ఇటు తెలుగు చిత్రసీమతో పాటు తమిళ, కన్నడ సినీ రంగాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
కేవీ రెడ్డి మార్గదర్శకంలో అడుగులు: ప్రయోగాలకు తొలి పునాది
సింగీతం ప్రస్థానం అనుకోకుండా మొదలైంది కాదు. దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టకముందే ఆయన దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి దగ్గర 'మాయాబజార్', 'జగదేకవీరుని కథ' వంటి అమరకావ్యాలకు సహదర్శకుడిగా వ్యవహరించారు. సోషల్, మైథాలజీ, జానపదం.. ఏ జానర్ అయినా కొట్టిన పిండిలా తెరకెక్కించే కేవీ రెడ్డి శైలిని దగ్గరుండి గమనించిన సింగీతం, ఆ పాఠాలనే తన భవిష్యత్ ప్రయోగాలకు బలమైన పునాదిగా మార్చుకున్నారు. 1972లో 'నీతి-నిజాయితీ' చిత్రంతో స్వతంత్ర దర్శకుడిగా మారినప్పుడే ఆయన తన విలక్షణతను చాటుకున్నారు. మూగవాడైన నాయకుడు, ఆయన్ను దారికి తెచ్చే బలమైన నాయిక పాత్రతో అప్పట్లోనే ఓ సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

ఎన్టీఆర్, అక్కినేని, రాజ్‌కుమార్‌లతో అనుబంధం
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుతో 'పిల్లా జమీందార్', 'సంగీత సమ్రాట్', 'వసంత గీతం' వంటి గొప్ప చిత్రాలను అందించిన సింగీతం, వ్యాపారాత్మక సూత్రాలకు ఎప్పుడూ లొంగలేదు. కన్నడలో వరుణ్ పట్నాయక్ కాంబినేషన్‌లా వరనటుడు డాక్టర్ రాజ్‌కుమార్‌తో 'జ్వాలాముఖి', 'భాగ్యద లక్ష్మి బారమ్మ' వంటి సూపర్‌హిట్ చిత్రాలు తీశారు. రాజ్‌కుమార్ కుమారులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. శబ్దానికే ప్రాణం పోసే శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ఆయన సినిమాల్లో సంగీతం ఒక ప్రత్యేక పాత్రలా జీవించేది.
కమల్ హాసన్ - సింగీతం: చరిత్ర సృష్టించిన కాంబినేషన్
భారతీయ సినీ చరిత్రలో సింగీతం శ్రీనివాసరావు - కమల్ హాసన్ జంట ఒక విప్లవం. 'రాజా పార్వై' (అమావాస్య చంద్రుడు)తో మొదలైన వీరి బంధం వెండితెరపై అద్భుతాలు సృష్టించింది. అసలు మాటలే లేకుండా కేవలం హావభావాలు, నేపథ్య సంగీతంతో నవ్వించి, ఏడిపించి, ఆలోజింపజేసిన 'పుష్పక విమానం' ఒక ఎవర్ గ్రీన్ సంచలనం. ఆ తర్వాత సిజీఐ సాంకేతికత లేని రోజుల్లోనే కమల్ హాసన్‌ను పొట్టివాడిగా చూపించి మేజిక్ చేసిన 'అపూర్వ సహోదరులు', నలుగురు కమల్‌లతో కామెడీ పండించిన 'మైఖేల్ మదన్ కామరాజు' నేటికీ ప్రతి స్క్రీన్ ప్లే రచయితకు ఒక పాఠ్య పుస్తకమే.
మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలు
సింగీతం ఆలోచనా విధానం ఎప్పుడూ తన కాలం కంటే కొన్ని దశాబ్దాలు ముందుండేది. 1991లో నందమూరి బాలకృష్ణతో ఆయన తీసిన 'ఆదిత్య 369' భారతదేశంలోనే తొలి టైమ్ ట్రావెల్ మూవీ. కృష్ణదేవరాయల కాలానికి, భవిష్యత్తులో భూమిపై మనుషులు ఆహారాన్ని క్యాప్సూల్స్ రూపంలో తీసుకునే ఆధునిక కాలానికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ ఆయన చూపిన విజన్ అద్భుతం. ఇక జానపద కళకు సరికొత్త ఊపిరులూదుతూ తీసిన 'భైరవద్వీపం', సుధాచంద్రన్ నిజ జీవిత ఆధారంగా తీసిన 'మయూరి', ఉపాధి, పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలపై తీసిన 'మగళీర్ మట్టుమ్', 'మేడమ్' చిత్రాలు ఆయన సామాజిక స్పృహకు నిదర్శనాలు.
దాదాసాహెబ్ ఫాల్కేకు ఏకైక అర్హుడు
అనిమేషన్ వైపు అడుగులేస్తూ 70 ఏళ్ల వయసు దాటాక 'సన్ ఆఫ్ అల్లావుద్దీన్', 'ఘటోత్కచ' చిత్రాలు రూపొందించిన సింగీతం, 82 ఏళ్ల వయసులో 'వెల్‌కమ్ ఒబామా'తో సరోగసీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. డిజిటల్ ఫార్మాట్‌లో సెన్సార్ పొందిన తొలి భారతీయ సినిమాగా 'ముంబై ఎక్స్‌ప్రెస్'ను నిలిపారు.
ఇటీవల తీసిన 'సింగీతం' వరకు ఆయన చేసిన ప్రతి ప్రయత్నం ఒక కొత్త పాఠమే. క్లింట్ ఈస్ట్‌వుడ్ కంటే ఎక్కువ వయసులో మెగాఫోన్ పట్టిన ఈ ఏకైక భారతీయ దిగ్గజానికి భారత అత్యున్నత పురస్కారమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' ఇవ్వడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. ప్రయోగాల శకానికి ముగింపు పలికి వెళ్లిపోయిన ఈ మహా దర్శకుడి ముద్ర భారతీయ సినీ చరిత్ర ఉన్నంతవరకు చెరిగిపోదు.














Click it and Unblock the Notifications
