కలిసి బతకలేక.. ఘోరమైన నిర్ణయం.. స్నేహితుడి గదిలో ప్రేమజంట ఇలా!
హైదరాబాద్: మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న వారిద్దరూ ప్రేమతో ఒకటవ్వాలని భావించారు. కానీ అడుగడుగునా ఎదురైన అడ్డంకులు వారిద్దరిని కృంగదీశాయి.
వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతినడం, ఆపై కులం సమస్యలు పెళ్లికి పెద్ద ఆటంకం కావడంతో.. ఇక చావే శరణ్యమనుకుని వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని రాంగనర్ పరిధిలో ఉన్న శివస్తాన్ పూర్ లో ఈ ఘటన జరిగింది. స్నేహితుడి గదిలో వీరిద్దరు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఇద్దరిదీ మెదక్ జిల్లానే:
మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన సంయుక్త(22) కూకట్ పల్లిలోని జేఎన్ టీయూలో ఇంజనీరింగ్(ఈసీఈ) ఫైనలియర్ చదువుతోంది.
ఆమె తల్లి మెదక్ జిల్లా శివంపేట మండలంలో తహశీల్దార్ గా పనిచేస్తున్నారు. కాగా, నర్సాపూర్ కే చెందిన అభిలాష్(25) హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అభిలాష్ తండ్రి మెదక్ జిల్లా కౌడిపల్లి వీఆర్వో.

పెళ్లికి 'నో' చెబుతారన్న భయంతో..:
అయితే వీరి ప్రేమకు పెద్దలు ఎక్కడ అడ్డు చెబుతారోనన్న భయం, కులం ప్రధాన సమస్య కావడంతో గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ప్రస్తుతం గ్రూప్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్న అభిలాష్ గతేడాది కిడ్నీ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

చికిత్స కోసం హైదరాబాద్:
ఈ నేపథ్యంలోనే గురువారం నాడు చికిత్స నిమిత్తం అభిలాష్ హైదరాబాద్ కు వచ్చాడు. స్నేహితుడు తిమ్మప్పకు ఫోన్ చేసి అతని రూమ్ లో ఒకరోజు ఉంటానని చెప్పాడు. తిమ్మప్ప సరేననడంతో గురువారం రాత్రి రాంనగర్ లోని శివస్తాన్ పూర్ లో అతను అద్దెకుంటున్న గదికి వెళ్లాడు.

స్నేహితుడి గదిలో:
గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తిమ్మప్ప శుక్రవారం ఉదయం 8గం.కు క్లాస్ కు వెళ్లిపోయాడు. మరో స్నేహితుడు కూడా బయటకు వెళ్లిపోవడంతో అభిలాష్ సంయుక్తకు ఫోన్ చేసి గదికి రప్పించాడు. దాదాపు నాలుగు గంటల పాటు గదిలోనే ఉన్న వీరిద్దరు తమ ప్రేమకు ఎదురవుతున్న కష్టాల గురించి తలుచుకుని బాధపడ్డారు.

పెట్రోల్ తీసుకొచ్చి.. ఆపై ఆత్మహత్య:
కలిసి బతకలేకపోతున్నందుకు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అభిలాష్ బయటకెళ్లి పెట్రోలు తీసుకొచ్చాడు. ఆపై ఇద్దరు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. అరుపులు, కేకలతో పక్కనే ఉన్న యువకులు అప్రమత్తమై తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే సంయుక్త అగ్నికి ఆత్మాహుతి కాగా అభిలాష్ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

గాంధీ ఆసుపత్రిలో అభిలాష్:
పోలీసులకు సమాచారం అందించడంతో అభిలాష్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. స్నేహితుడి గదిలో వీరు ఆత్మహత్యకు పాల్పడిన తీరు స్థానికుల్లో కలకలం రేపింది.

గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తిమ్మప్ప:
అభిలాష్ స్నేహితుడు తిమ్మప్ప గత ఐదేళ్లుగా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇతను రాంనగర్ ఏరియాలో ఓ గదిని అద్దెకు తీసుకుని చదువు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతని గదికి వచ్చిన అభిలాష్.. ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

అభిలాష్ ఏంచెప్పాడు?:
ఘటనపై పోలీసులు అభిలాష్‌ను ప్రశ్నించగా తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని, యువతి ఇంట్లో వారు తమ పెళ్లికి అంగీకరించరనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయ త్నించినట్టు తెలిపాడు. వచ్చే జన్మలోనైనా తమ ప్రేమ పెళ్లి దాకా వెళ్లాలని ఆత్మహత్యకు పాల్పడ్డామని అభిలాష్ చెప్పడం గమనార్హం.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు:
స్థానికుల ఫిర్యాదుతో డీసీపీ జోయెల్ డేవిస్, చిక్కడపల్లి సబ్ డివిజన్ ఏసీపీ జోగుల నర్సయ్య, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ బిట్టు మోహన్‌కుమార్, ఎస్సైలు రామరాజు, భాస్కర్‌రావు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications