మధుయాష్కీ సంచలన ఆరోపణలు: కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం!, కవిత ఆస్తులెంత?
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో బయటపడ్డ భారీ అవినీతిపై ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. ఆ పార్టీ నేతలంతా వరుసపెట్టి సీఎం కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
మూడేళ్ల పాటు సాగిన కేసీఆర్ పాలన అత్యంత దరిద్రం అని మధుయాష్కీ విరుచుకుపడ్డారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా పడి ఉంటానన్న కేసీఆర్.. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల శాపం కచ్చితంగా కేసీఆర్ కు తగులుతుందన్నారు. సర్వేలతోనే టీఆర్ఎస్ నాశనం అవుతుందని ఘాటుగా విమర్శించారు.

చర్యలేవి:
జీహెచ్ఎంసీలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణంపై సీఎం కేసీఆర్ చర్యలెందుకు తీసుకోలేదని మధుయాష్కీ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి సంపాదనను విదేశాల్లో దాచుకున్న విషయం నిజమా? కాదా? అని నిలదీశారు. కుంభకోణానికి కేటీఆర్ నైతిక బాధ్యత ఎందుకు వహించలేదని మండిపడ్డారు.
ఐటీ హబ్ పేరు చెబుతూ తెలంగాణను గబ్బు చేస్తున్నారని, ఇప్పటివరకు ఎంతమంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు కట్టించని సీఎంకు.. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకోవడానికి మాత్రం డబ్బులున్నాయా? అని ప్రశ్నించారు.

కవితపై ఆరోపణలు:
మియాపూర్ భూకంభకోణంలో ఎంపీ కవిత, ఆమె భర్త కన్నారావులపై మధుయాష్కీ ఆరోపణలు చేశారు. కుంభకోణంలో వారి పాత్రను తేల్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో మంత్రులంతా సీమపందుల్లా మారారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దుష్ట పాలనకు అంతం సంగారెడ్డి నుంచే మొదలైందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేసీఆర్ కుటుంబ దోపిడీపై రాహుల్ అడిగిన ప్రశ్రలకు సమాధానం చెప్పాలన్నారు. భూకంభకోణం అవినీతిపై త్వరలోనే సీబీఐని ఆశ్రయిస్తామని తెలిపారు.

తలసాని ముందు మాత్రమే:
మియాపూర్ భూకంభకోణంలో తలసాని ముందు మాత్రమే ఉన్నారని, వెనకాల ఉన్నదంతా కేసీఆర్ కుటుంబ సభ్యులేనని మధుయాష్కీ ఆరోపించారు. ఎంపీ కవిత భర్తపై వేల కోట్ల అవినీతి ఆరోపణలున్నాయని, వారి ఆస్తుల లెక్కెంతో తేల్చాలని అన్నారు. అపార్ట్ మెంట్ నుంచి కోట్ల విలువ చేసే విల్లాలోకి ఎలా మారగలిగారని ఎంపీ కవితను ప్రశ్నించారు. వ్యాపారాలు చేయకుండా ఆస్తుల ఎలా కూడబెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంటింటిని కదలిస్తాం:
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు గ్రామల్లోకి వెళ్లి ప్రతీ ఇంటిని , ప్రతీ వ్యక్తిని కదలిస్తామని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఏకం చేసి పోరాడుతామని తెలిపారు. రాహుల్ సభతో బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని తేలిపోయిందన్నారు. మతం మాంసం పేరుతో నరేంద్ర మోడీ దేశాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications