వేములవాడలో మూడు రోజులపాటు మహా శివరాత్రి ఉత్సవాలు.. షెడ్యూల్ ఇలా!!
మహా శివరాత్రి వేడుకలకు వేములవాడ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో మహాశివరాత్రికి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడానికి దేవస్థానం నిర్ణయించింది. మార్చి 7, 8, 9 తేదీలలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు వేములవాడ దేవస్థానం వెల్లడించింది. మహా శివరాత్రికి భారీసంఖ్యలో భక్తులు రానున్న నేపధ్యంలో వేములవాడ ఆలయ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మార్చి 7వ తేదీ రాత్రి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి టిటిడి పట్టు వస్త్రాలు సమర్పించనుంది. ఇక మహాశివరాత్రి రోజున తెల్లవారు జాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తారు. తెల్లవారుజామున 12 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది.

ఆపై 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శన అవకాశాన్ని కల్పిస్తారు. 3 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన, ఆపై 3 గంటల 40 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు సుప్రభాత సేవ,ఆలయ శుద్ధి నిర్వహిస్తారు.
4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ప్రాతః కాల పూజ ఉంటుంది. 8 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆపై సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం, 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు.
రాత్రి 11: 35 నిమిషాలకు రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వేములవాడ దేవస్థానం ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.












Click it and Unblock the Notifications