ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న శ్రవణ్ రావు.. అనంతరం విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరు కావాలని మార్చి 26న శ్రవణ్ రావు కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. మూడు రోజుల తర్వాత విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.

మరోవైపు పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్టు చేయొద్దని ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో శ్రవణ్‌ను పూర్తిస్థాయిలో విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నడుచుకున్నారనేది సిట్ ప్రధాన అభియోగం. శ్రవణ్ రావు తాను చేసిన సర్వే ఆధారంగానే పలువురిపై నిఘా ఉంచాలని ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు సూచించారని ప్రాథమిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2023 శాననసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు సూచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావును విచారించడం ద్వారా ఈ విషయాలపై స్పష్టత రానున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications