తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా: ఎందుకంటే?
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా బరిలోనిలిచేందుకే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. వారం క్రితమే రాజీనామా లేఖను తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపినట్లు వెల్లడించారు.
కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని మల్లు రవి ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు మల్లు రవి. కాగా, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో సంపత్, మల్లు రవి మధ్య పోటీ ఏర్పడింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం వీరిలో ఎవరిని పోటీ చేయాలని నిర్ణయిస్తే వారే పోటీ చేసే అవకాశం ఉంది. మల్లు రవి తనకు టికెట్ వస్తుందనే నమ్మకంతోనే ప్రస్తుత ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలకు పోటీ బాగా పెరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినవారు, ఎమ్మెల్యే టికెట్ దక్కనివారు, ఇతర సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రజాదరణ, గెలిచే అభ్యర్థులనే బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పదికిపైగా స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications