మేడారం జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. ఈ మహా జాతర 2026 జనవరి 28 నుండి జనవరి 31 వరకు 4 రోజులపాటు జరుగనుంది. మేడారం జాతరకు జనం పోటెత్తారు. శనివారం నుంచి స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఈ మహా జాతరకు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా భారీగా తరలివస్తున్నారు.
మరోవైపు మేడారం మహా జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 3,600 బస్సులను నడపాలని నిర్ణయించింది. అలాగే మేడారం వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. మేడారంలో 14,000 మంది ఆర్టీసీ సిబ్బంది కోసం బేస్ క్యాంప్, తాత్కాలిక బస్టాండ్, 55 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకూ ఈ మహా జాతర కొనసాగనుంది. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ములుగు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధాన మార్గాలైన వస్రా, తాడ్వాయి పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరించింది.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతరను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ మహా జాతర 2026 జనవరి 28 నుండి జనవరి 31 వరకు 4 రోజులపాటు జరుగనుంది. మహా కుంభమేళా తర్వాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే జాతర ఇదే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మేడారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది.












Click it and Unblock the Notifications