మేడారం జాతర హుండీ ఆదాయం నాలుగురోజుల్లో 10కోట్లు పైనే.. ఈసారి భారీగానే!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతోంది. నేడు ఐదవ రోజు సిబ్బంది హుండీల లెక్కింపు చేస్తున్నారు. హన్మకొండలోని టిటిడి కళ్యాణమండపంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ హుండీల లెక్కింపు జరుగుతుంది. 400 మందికి పైగా సిబ్బంది, అధికారులు ఈ హుండీల లెక్కింపులో పాల్గొంటున్నారు.
నాలుగు రోజుల్లో మేడారం జాతర ఆదాయం ఇలా
ఇప్పటివరకు నాలుగు రోజులలో లెక్కించిన హుండీల ద్వారా 10,71,22,116 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. మొదటిరోజు 125 హుండీలను లెక్కించగా, రెండవ రోజు 160 హుండీలను లెక్కించారు, మూడవరోజు 140, నాలుగవ రోజు 200 హుండీలు లెక్కింపు చేశారు. నాలుగవ రోజు హుండీల లెక్కింపులో 2కోట్ల 64 లక్షల 75 వేల 757 రూపాయల ఆదాయం వచ్చింది.

నాలుగు రోజులలో మొత్తం 625 హుండీల లెక్కింపు
మొత్తం నాలుగు రోజులలో మొత్తం 625 హుండీలను లెక్కించారు. ఇప్పటివరకు మేడారం జాతర హుండీలలో 10 కోట్లకు పైగా ఆదాయం రాగా, ఈసారి ఆదాయం బాగానే వస్తుందని అధికారులు భావిస్తున్నారు. గత జాతరలో 13 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు మధ్య ఈ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది.
మేడారానికి పోటెత్తిన భక్తజనం
హుండీల నుండి వచ్చిన ఆదాయంలో 33 శాతం సమ్మక్క సారలమ్మల పూజారులకు వాటాగా ఇస్తారు. మిగతా ఆదాయం దేవాదాయ శాఖకు చేరుతుంది. ఇదిలా ఉంటే నిన్న మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి ఆదివారం కావడంతో భక్తజనం పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
మేడారంలో వాహనాల రద్దీ
మేడారానికి భక్తులు పోటెత్తడంతో ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. దేవతలను దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఏది ఏమైనా మేడారం మహా జాతరకు మాత్రమే కాదు జాతర తర్వాత కూడా మేడారానికి జనం వచ్చి పోతూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications