ప్రయాణికుల దెబ్బకు దిగొచ్చిన మెట్రో యాజమాన్యం...ఉచిత పార్కింగ్‌పై కీలక నిర్ణయం...
హైదరాబాద్ మెట్రో ఉచిత పార్కింగ్ పై యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని యాజమాన్యం వాయిదా వేసింది. తదుపరి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మెట్రో స్టేషన్ల దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలుపై ఇటీవలే మెట్రో యాజమాన్యం ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే ఆగస్టు 25వ తేది నుంచి నాగోల్ మెట్రో, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్‌లో మెట్రో పార్కింగ్ లాట్లో పెయిడ్ పార్కింగ్ అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 25న మహాధర్నాకు పిలుపునిచ్చారు. ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారంటూ మహాధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని పునరుద్దరించాలంటూ ఆగస్టు 25వ తేదిన నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద ప్రయాణికులు మహాధర్నా చేపట్టేందుకు పూనుకున్నారు.

ఈ క్రమంలో మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ నిర్ణయంపై మెట్రో యాజమాన్యం వెనక్కి తగ్గింది. తదుపరి నోటిసులు వచ్చే వరకు ఉచిత పార్కింగ్ కొనసాగే అవకాశం కన్పిస్తోంది. అయితే, మెట్రో పెయిడ్ పార్కింగ్ విధానంపై తదుపరి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని ఎల్ అండ్ టీ మెట్రో యాజమాన్యం ప్రకటించింది.












Click it and Unblock the Notifications