హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ: కొత్త కారిడార్లు ఇలా
హైదరాబాద్: భవిష్యత్తులో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రూ.69వేలకోట్లతో హైదరాబాద్ నలుదిశలా మెట్రో విస్తరణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో సోమవారం జరిగిన కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో ఎండీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పటాన్ చెరువు నుంచి నార్సింగ్ వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్, తుక్కుగూడ, బొంగుళూరు, పెద్ద అంబర్‌పేట వరకు 40 కిలోమీటర్లు మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు తెలిపారు. మేడ్చల్ నుంచి పటాన్‌చెరు వరకు 29 కిలోమీటర్లు, తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు ఎనిమిది కిలోమీటర్లు, ఎల్‌బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో కారిడార్ విస్తరించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యమని ఎన్‌వీఎస్‌రెడ్డి తెలిపారు. గతంలో తన ప్రతిపాదనను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ విజన్‌తో ఓఆర్‌ఆర్ మెట్రోకు ముందడుగు పడిందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో పనులు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ కూడా మెట్రోను అనుసంధానిస్తామన్నారు.
శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు 28 కిలోమీటర్ల విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ చెప్పారు. ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, తార్నాక నుంచి మౌలాలి వరకు ఐదుస్టేషన్లతో మెట్రో విస్తరిస్తామన్నారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నామన్నారు. ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. ఇవన్నీ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్(పీపీఆర్) దశలో ఉన్నాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications