చెట్టులెక్కగలను..! తాటి కల్లు తాగిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్: చెట్టులెక్కగలను.. చెట్టులెక్కి కల్లు తాగగలను అంటున్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అటుగా వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాటిచెట్లను చూసి గౌడన్నలా మారిపోయారు. ఏకంగా చెట్టు ఎక్కి కల్లు తీశారు. ఆ తర్వాత కల్లును సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. గ్రామంలో గిరకతాటి చెట్టు నుంచి కల్లు వస్తుండటం గమనించి అక్కడే ఆగారు. ఆ తర్వాత అనుకున్నదే తడవుగా ఆ తాటి చెట్టును నిచ్చెన సాయంతో ఎక్కారు. కల్లు కట్టిని లొట్టిని కిందకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కల్లును గ్లాసులోపోసుకుని బాగుందనుకుంటూ తాగేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

కాగా, పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో మూడేళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరిక తాటి మొక్కలను పంపిణీ చేశారు. అప్పుడు మంత్రి పంపిణీ చేసిన గిరక తాటి మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లుగా మారిపోయాయి. కల్లు కూడా వస్తోంది. ఈ క్రమంలోనే ఆ తాటి చెట్టును ఎక్కిన మంత్రి ఎర్రబెల్లి.. కల్లు కిందకు తీసుకొచ్చి సేవించారు. ఏకంగా మంత్రే వచ్చి తాటిచెట్టు ఎక్కి కల్లు తీసి తాగడంతో అక్కడున్న వారంతా ఆసక్తిగా గమనించారు.
కాగా, తాటి చెట్ల కంటే గిరకతాటి చెట్లు చిన్నవిగా ఉంటాయి. వంద అడుగుల వరకు ఉండే తాటి చెట్లు ఎక్కడం కంటే 10 నుంచి 20 అడుగుల ఎత్తున్న గిరక తాటి చెట్లు ఎక్కడం సులభంగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం గతంలో గీత కార్మికులకు గిరకతాటి మొక్కలను పంపిణీ చేసింది. సాధారణంగా తాటి చెట్టు సుమారు వంద అడుగుల ఎత్తులో ఉండి.. పది సంవత్సరాల తర్వాత గానీ గీతకు రాదు. కానీ, ఈ గిరకతాటి చెట్లు మాత్రం తక్కువ ఎత్తులోనే ఉండి కేవలం ఐదేళ్లకే గీతకు వస్తాయి.అంతేగాక, 100 తాటికాయల వరకు దిగుబడిని ఇస్తాయి. సీజన్లో రోజుకు 3-10 లీటర్ల కల్లును ఇస్తాయి. అందుకే ఎక్కువగా గిరకతాటి కల్లుకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది.












Click it and Unblock the Notifications