దేశం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోంది.. అందుకే భారత్ రాష్ట్ర సమితి: మంత్రి ఎర్రబెల్లి
టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చి భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంతో పాటు, జాతీయ రాజకీయాలలో కీలకంగా ముందుకు వెళతామని చేసిన ప్రకటన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని కారణమౌతుంది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంత కాలం నుండి దూకుడుగా ముందుకు వెళ్తున్న కెసిఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ పేరును ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచి అని, కెసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని వ్యాఖ్యలు చేశారు. దేశానికి దిశానిర్దేశం చేయడానికి, నవ శకానికి నాంది పలకడానికి భారత రాష్ట్ర సమితి ఏర్పాటైందని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు ప్రజా రంజకంగా పాలించడంలో విఫలమయ్యాయని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రత్యేకించి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మత విద్వేష వైషమ్యాలను రెచ్చగొట్టి, ప్రజలను విడదీసి పరిపాలన చేస్తోందని మండిపడ్డారు.

పరిపాలనా దక్షుడు కేసీఆర్.. తెలంగాణా దేశానికే దిక్సూచి
ఈ దశలో ప్రజలు లౌకిక, ప్రజాస్వామిక, పరిపాలనా దక్షుడు ఆయన నాయకుడి కోసం కోసం ఎదురుచూస్తున్నారు అని అభిప్రాయపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ నాయకుడు కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. గొప్ప పరిపాలన అనుభవం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కెసిఆర్ తెలంగాణ ను అనతికాలంలోనే అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇవ్వాళ దేశం మొత్తం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నదంటే అది కేసీఆర్ వల్లే అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ గొప్ప దార్శనికత తో కూడుకున్నదని, ఇక తెలంగాణ మోడలే దేశానికి దిక్సూచి...కేసిఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.

తెలంగాణాలో సంక్షేమ పథకాలు, సంక్షేమ పాలన ఆదర్శం
ఉద్యమ నాయకుడు కేసిఆర్ స్థాపించిన టిఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీ గా మొదలై, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,దేశంలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు . కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి.. తెచ్చుకున్న కొత్త రాష్ట్రం అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతు బంధు, రైతు భీమా, 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్,ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, దళిత బంధు, సబ్బండ వర్గాల సంక్షేమం లాంటి ఎన్నో సంస్కరణల పథకాలతో తెలంగాణను ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి చేశారన్నారు .

అభివృద్ధిని కూడా ఉద్యమంగా చేపట్టిన నాయకుడు కేసీఆర్
అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంగా చేపట్టి, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా ఇదే తరహాలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని దేశ ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారన్నారు. దేశ ప్రజలు కేసిఆర్ ని దేశ రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తున్నారన్నారు.మరోవైపు బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ, నిత్యావసరాల ధరలు పెంచుతూ, ప్రజా స్వామ్యాన్ని బిజెపి అపహాస్యం చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తిని విస్మరిస్తూ, చేస్తున్న పాలన ప్రజలకు విసుగు తెప్పిస్తోందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

దేశం కేసీఆర్ వంటి నాయకుడు కావాలని కోరుకుంటోంది
కేసిఆర్ లాంటి నాయకుడు, తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. యావత్ దేశ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ "భారత్ రాష్ట్ర సమితి" తో దేశ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం అన్నారు. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశ ప్రజల ఆదరాభిమానాలు, మద్దతు కెసిఆర్ కు కచ్చితంగా ఉంటుందని, బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications