జాలర్లతో కలిసి చెరువులోకి వెళ్లి.. వల విసిరి చేపలు పట్టిన మంత్రి ఎర్రబెల్లి!!
ప్రజలతో మమేకం అవ్వడంలో మంత్రి ఎర్రబెల్లి రూటే సపరేటు. ఏ పని చేసే వారితో అయినా ఆయన ఇట్టే కలిసిపోతారు. అప్పట్లో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా కూలీల వద్దకు వెళ్లి, వాళ్లతో కలిసి వ్యవసాయ పనులు చేసి, వారి లంచ్ బాక్సులలో భోజనం చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఇటీవల ఉపాధిహామీ కూలీలతో కలిసి ఉపాధి హామీ కూలిగా మారి పార చేతబట్టి పని చేశారు.
తాజాగా జాలర్లతో కలిసి చెరువులోకి వెళ్లిన ఎర్రబెల్లి వల విసిరి చేపలు పట్టి అందరిని అబ్బుర పరిచారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ గ్రామాల్లో ఘనంగా జరుగుతోంది. ఈ పండుగ కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొంటూ వస్తున్నారు.

ఈరోజుపెద్ద వంగర మండలం గంట్ల కుంట గ్రామ సమీపంలోకి రాగానే ఈ రోజు మృగశిర కావడంతో కుంటకట్ట చెరువు వద్ద చేపలు పడుతున్న జాలర్లను మంత్రి ఎర్రబెల్లి చూశారు. వెంటనే తాను ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి వారితో సరదాగా కాసేపు సంభాషించారు. చేపలు పడ్డాయా? అంటూ ఆరా తీశారు. ఇప్పుడే పడుతున్నాం అని వారు చెప్పడంతో తాను కూడా చేపలు పట్టడానికి ఉపక్రమించారు.
వేసుకున్న ప్యాంటును పైకి లాగి, నేరుగా చెరువులోకి దిగిన మంత్రి వాళ్లతో కలిసి చేపలు పట్టారు. తమతో కలిసి చేపలు పట్టడానికి వస్తున్న మంత్రిని చూసి ఆశ్చర్య పోయిన జాలర్లు ఓవైపు వలను మంత్రికి అందించి, మరోవైపు వలను వారు పట్టుకున్నారు. ఇక అందరూ కలిసి వలవిసిరి చేపలు పట్టారు. పట్టిన చేపలు చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబరపడ్డారు.

అంతేకాదు చేపపిల్లలు చితంగా వస్తున్నాయా? చేపలు పెద్దగా అవుతున్నాయా? చేపల ద్వారా వారి ఆదాయ మార్గం ఎలా ఉంది? వంటి వివరాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుసుకున్నారు. ప్రభుత్వం నీటితో చెరువులను నింపి, ఆ నీటిలో ఉచితంగా చేప పిల్లలు వేసి, జాలర్లకు చేపలు పట్టుకునే అవకాశం కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
మత్స్యకారులకు ఆదాయ మార్గాన్ని చూపించిందని మంత్రి వారికి చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ గారి దయవల్ల, కృషి వల్ల జరుగుతుందని చెప్పారు. తెలంగాణకు పూర్వవైభవం తెచ్చి అన్ని రంగాలలో ముందు భాగంలో నిలిపిన సీఎం కేసీఆర్ కి అండగా ఉండాలని వారిని కోరారు.












Click it and Unblock the Notifications