విశాఖ ఉక్కు కంటే ముందు ఆ సంగతి తేల్చండి .... కేసీఆర్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ఇస్తూ తాము కూడా ఉద్యమం చేస్తామని, అవసరమైతే ఏపీలో ఉద్యమంలో పాల్గొంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై బిజెపి నేతలు మండిపడుతున్నారు. బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎందుకు తెరవలేదో చెప్పాలని డిమాండ్
స్టీల్ ప్లాంట్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిన తర్వాత కెసిఆర్ కుటుంబం విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడు సంవత్సరాలుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఎందుకు తెరవలేదో చెప్పాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రజల వద్ద వ్యతిరేఖతను తగ్గించుకోవడం కోసం బిజెపిపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

కేంద్రాన్ని విమర్శించే ముందు మీ వైఫల్యాలను చూసుకోండి
బాధ్యతారహితంగా కేంద్రం పై, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలకు పూనకం వస్తుందని ఆరోపించారు. కేంద్రాన్ని విమర్శించే ముందు రాష్ట్ర పరిధిలో ఉన్న అనేక అంశాల విషయంలో రాష్ట్రం వైఫల్యం చెందిందని ఆరోపించిన కిషన్ రెడ్డి ముందు టిఆర్ఎస్ పార్టీ నేతలు దానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, దానిని సైడ్ ట్రాక్ పట్టించటం కోసం అనవసరంగా బిజెపిపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యల దుమారం .. మండిపడుతున్న బీజేపీ నేతలు
తెలంగాణా మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యమానికి మద్దతు ప్రకటించటమే కాకుండా కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న క్రమంలో బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగారు. ముందు తెలంగాణా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమన్నారు . రాష్ట్రంలో మూతపడిన కంపెనీలపై ప్రశ్నిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications