కాలిగోటికి సరిపోనివాడే ఫాంహౌస్‌లో పడుకోబెట్టాడు: కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని.. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారనే విషయం గుర్తుంచుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కాలు గోటికి సరిపోడని అంటావా? అని కేటీఆర్‍పై మండిపడ్డారు. కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫాంహౌస్‌లో పండబెట్టాడని కేటీఆర్‌కు చురకలంటించారు మంత్రి కోమటిరెడ్డి. అధికారం చేజారినా కేటీఆర్ తన అహంకారాన్ని మాత్రం వీడటం లేదని విమర్శించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. కేటీఆర్ దొంగ మాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారని విమర్శలు గుప్పించారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని... కానీ కేటీఆర్ మాత్రం తన తండ్రి కేసీఆర్ పేరుతో దొంగమాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యారని చురక అంటించారు.
రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోడన్నారు. కేటీఆర్ అహంకారం కారణంగానే నల్గొండలో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో.. ఎక్కువ సీట్లు గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేసే పార్టీ అన్నారు. మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన మూడో రోజునే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని.. కానీ, బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.
కాగా, సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం సీటు కొన్నారని ఎద్దేవా చేశారు. అమలుకానీ వాగ్ధానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి.. కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications