ఖర్గేతో కొండా సురేఖ భేటీ- ఆయనా హెల్ప్ లెస్? హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి: ఏం జరుగుతుంది?
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవలే ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గళం విప్పారు. మంత్రివర్గం నుంచి బహిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు.. ఆమె పట్ల అంటీముట్టనట్టుగా ఉంటోన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలపై అటు కొండా సురేఖ కూడా స్పందించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతోనే ఆమె నేరుగా ఖర్గేను ఆశ్రయించినట్లు చర్చ జరుగుతోంది. యూకే పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశమైంది. ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే మంత్రి సురేఖ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.

ఈ పరిణామాల మధ్య ఆమె బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అయ్యారు. కొండా సురేఖతో పాటు ఆమె కుమార్తె సుస్మితపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ పార్టీకి చెందిన దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు మంత్రులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుస్మిత సంచలన ఆరోపణలు చేయడం, పరకాల అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానంటూ ప్రకటించుకోవడం, కుమార్తె ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కొండా సురేఖ వాటిని ఖండించకపోవడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. వాటి గురించి పూర్తి వివరాలను అందజేశారు. తన వాదనలను కూడా కొండా సురేఖ గట్టిగా వినిపించినట్లు తెలుస్తోంది.
తాను ముఖ్యమంత్రికి లేదా పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేస్తున్నారని వివరించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని, సమగ్ర విచారణ జరిపించాలని ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటం, టికెట్ల కేటాయింపుపై ఏకపక్ష ప్రకటనలు చేయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఖర్గే ఆమెకు స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
మరోవంక.. యూకే పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ క్రమశిక్షణపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లీడర్లు ఎవరైనా సరే లక్ష్మణ రేఖ దాటితే కఠిన చర్యలు ఉంటాయని, ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గత కమిటీల వేదికగానే పరిష్కరించుకోవాలని సూచించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అఖిల భారత ఓబీసీ అసోసియేషన్ రంగంలోకి దిగింది. ఆమె బీసీ వర్గానికి చెందిన మహిళా నేత కావడం వల్లే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీలో కొందరు నేతలు బహిరంగంగానే సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసినా వారికి నోటీసులు ఇవ్వకుండా, కుమార్తె చేసిన వ్యాఖ్యలకు మంత్రిని బాధ్యురాలిని చేయడం సరికాదని తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications