వాళ్ళు తెలంగాణాకు పట్టిన దరిద్రం!!
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను టార్గెట్ చేసి మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మృతిపై రాజకీయాలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశాపల్లిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వేధింపులకు గురై మృతి చెందిన ప్రీతి విషయంలో కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయిన వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నాయి
ఇక ఇదే సమయంలో దేశంలో రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దివాలా కోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, పచ్చని తెలంగాణను విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ప్రజల బాగోగులను వారు ఏనాడూ పట్టించుకోలేదని పేర్కొన్న కేటీఆర్ అంబానీలు, అదానీలకు వారు ఊడిగం చేయడంలోనే మునిగిపోయారంటూ ఆరోపించారు. అంతేకాదు కేంద్రంలో ఉన్న బిజెపి అరాచక పాలనను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి 10 చాన్సులు ఇచ్చారు.. అప్పుడు ఏం చేశారు?
దేశాన్ని రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో దరిద్రాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనికిమాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 10 అవకాశాలు ఇచ్చిన అభివృద్ధి చేయాలన్న సోయి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు కేటీఆర్. మీ దిక్కుమాలిన పార్టీకి 10 చాన్సులు ఇచ్చారు ఏం చేశారు .. గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా అంటూ మండిపడ్డారు. ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ మీరు అడుక్కుంటే మీకు ఓటెయ్యాలా అంటూ రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలను ఎవరు నమ్మరు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

బండి సంజయ్ పై భగ్గుమన్న మంత్రి కేటీఆర్
ఇక బండి సంజయ్ ను టార్గెట్ చేసిన కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడితే మసీదులు కూలగొడతాం అంటున్నారు. మసీదులు కూలగొట్టేవాడు ఎంపీ నా అంటూ మండిపడ్డారు. కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బిజెపిని విమర్శిస్తే సిబిఐ, ఈడి లాంటి వేట కుక్కలను ఉసిగొలుపుతున్నారని, తాము దేనికి భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఒకే ఒక పని పెట్టుకున్నారని ప్రజల్ని దోచుకుంటూ, మూటలు కట్టి, వాటిని పంచి ఓట్లు కొంటున్నారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు.

బీజేపీ తెలంగాణాకు పట్టిన దరిద్రం
మతం పేరుతో మంటలు రేపుతూ, కులం పేరుతో కుంపట్లు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బిజెపి అంబానీ, అదానీల ఆస్తులు రెట్టింపు చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు బిజెపి తెలంగాణకు పట్టిన దరిద్రమని పేర్కొన్న ఆయన బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఎవరికి అర్థం కాదని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డికి మెదడు మోకాళ్లలో ఉందో .. అరికాళ్ళలో ఉందో కూడా తెలియడం లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications