మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్; డోర్నకల్ బీఆర్ఎస్ టికెట్ వార్!!
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ముదురుతోంది. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డోర్నకల్ నియోజకవర్గంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ ఇద్దరూ ఆశలు పెట్టుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారు.
టికెట్ తనకంటే తనకంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. చాలా కాలంగా రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు అన్న దానిపైన స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇటీవల మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తాను ఎప్పుడు చనిపోతానా అని పార్టీలో పలువురు ఎదురుచూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డోర్నకల్ అసెంబ్లీ టికెట్ మళ్లీ తనదేనని, తాను మళ్లీ పోటీ చేసి గెలిచే తీరుతానని రెడ్యానాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని పేర్కొన్నారు.
రెడ్యా నాయక్ నిర్వహించే కార్యక్రమాలకు మంత్రి సత్యవతి వర్గం హాజరు కావటం లేదు. ఇక తాజాగా ఇరువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇరువురి మధ్య ఉన్న వర్గ విభేదాలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. మొదటినుంచి రెడ్యానాయక్ కు, సత్యవతి రాథోడ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో సత్యవతి రాథోడ్ టీడీపీ లోనూ, రెడ్యానాయక్ కాంగ్రెస్ లోనూ ఉన్నారు.
ఆ సమయంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థులు వీళ్ళిద్దరే. అనంతరం ఆ ఇద్దరు బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ, ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు నేటికీ కొనసాగుతూనే ఉంది. ఒకరి కార్యక్రమాన్ని ఇంకొకరు బాయ్ కాట్ చేయటం, ఇరువురు నేతలకు అలవాటుగా మారింది. దీంతో ఇరువురు నేతల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ల వివాదాన్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఎవరికి డోర్నకల్ టికెట్ ఇస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications