లాక్‌డౌన్ లో పోలీసుల కర్తవ్యం సూపర్.!ప్రజల క్షేమం కోసమే లాక్‌డౌన్ అన్న మంత్రి సత్యవతి రాథోడ్.!
మహబూబాబాద్/హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం తీపుకుంటున్న చర్యలతో పాటు, లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్న పోలీసుల సేవలు, ప్రజల్లో కరోనా పట్ల వారు తీసుకోస్తున్న అవగాహనా కార్యక్రమాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో భాగంగా పోలీసుల అంకితభావం మర్చిపోలేనిదని, సమాజహితం కోసం, సామాన్య ప్రజల సంక్షేమం కోసం వారు చూపిస్తున్న తెగింపు, చొరవ చాలా గొప్పదని మంత్రి ప్రశంసించారు.

ప్రజలు కోవిడ్ బారిన పడొద్దనే లాక్‌డౌన్ విధింపు..
ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెట్టిన లాక్‌డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్ పట్టణంలో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న తీరును, పోలీసుల విధి నిర్వహణ విధానాన్ని బుదవారం ఆమె పరిశీలించారు. లాక్‌డౌన్ ను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిస్థితులను మంత్రి సమీక్షించారు.

లాక్‌డౌన్ లో పోలీసుల సేవలు భేష్..
కోవిడ్ సమయంలో గత ఏడాది నుంచి పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు కట్టడి చేస్తూనే, కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారన్నారు మంత్రి సత్యవతి. సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఏడాది లాక్‌డౌన్ కు నాలుగు గంటలు మినహాయింపు ఇచ్చిన సమయంలో ప్రజలు గుంపులుగా గుమికూడకుండా ఉండేందుకు, కోవిడ్ నిబంధనల మేరకు నిత్యావసరాలు తీసుకునేటట్లు పోలీసుల సహకారం ప్రజలకు ఉంటుందని మంత్రి చెప్పారు.

కరోనా కట్టడికి పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు..
గ్రామాల్లో కోవిడ్ కట్టడి, గుర్తింపు, చికిత్స కోసం వేసిన గ్రామ కమిటీల్లో కూడా పోలీసులు నిత్యం వారితో ఉంటూ లాక్‌డౌన్ అమలు అయ్యేటట్లు, ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ఉండేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 4000 మంది కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వారందరికీ ఇంటి దగ్గరే మందులు ఇస్తూ, ధైర్యాన్ని చెబుతూ, వారికి అండగా ఈ గ్రామ కమిటీలు పనిచేస్తున్నాయన్నారు. ఒకవేళ కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడే వారు కూడా భయాందోళనలకు గురి కావద్దని, ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మందులు, వసతులు అన్నీ ఉన్నాయని మంత్రి చెప్పారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
కరోనా విజృంభిస్తున్న తరుణంలో అనవసరంగా బయటకు రాకుండా లాక్‌డౌన్ పాటిస్తూ కోవిడ్ కట్టడికి సహకరించాలని మంత్రి సత్యవతి విజ్ణప్తి చేశారు. నిత్యావసరాలకు కూడా కుటుంబంలో ఎవరో ఒకరే బయటకు రావాలని, కుటుంబాన్ని కరోనా నుంచి ఎప్పటికప్పుడు రక్షించుకోవాలని సూచించారు. కోవిడ్ బారిన పడ్డ వారికి కూడా ఇబ్బంది లేకుండా వైద్యం అందించేందుకు కావల్సిన ఏర్పాట్లు జిల్లాలోనే ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమం, సురక్షితం కోసం అనేక జాగ్రత్తలు ప్రబుత్వం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి కూడా ప్రజలు సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేసారు.












Click it and Unblock the Notifications