ఏపీ, తెలంగాణాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసే బీజేపీ కుట్ర: మోడీపై విరుచుకుపడిన మంత్రి తలసాని
రాజ్య సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులు ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు, బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కొనసాగాయి.

తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీపై మరోమారు విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని మోడీ పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు అసంబద్ధమైన వ్యాఖ్యలని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

గుజరాత్ కంటే తెలంగాణా అభివృద్ధిలో ముందుకు ... అందుకే ఇలా అక్కసు
తెలంగాణ రాష్ట్రం గుజరాత్ కంటే అభివృద్ధిలో ముందుకు వెళుతుంటే ప్రధాని మోడీ ఓర్వలేక పోతున్నారని, అందుకే తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. రాజ్య సభలో మోడీ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారని, మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అసలు తెలంగాణ ఏర్పాటు పై ప్రధాని మోడీ మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై అడుగడుగునా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణా బీజేపీ నేతలను టార్గెట్ చేసిన తలసాని
తెలంగాణ రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగం మార్చాలంటే మండిపడుతున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం ఇస్తారో చెప్పాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ బిజెపి నేతలను ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రాన్ని చిన్నచూపు చూడటమే కాకుండా ఇప్పుడు విభజనపై మాట్లాడి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
Recommended Video

మోడీ క్షమాపణ చెప్పకుంటే బిజెపి నేతలను అడ్డుకుంటాం
యూపీలో ఎస్పీ గెలుస్తుందని వస్తున్న సర్వేలు చూసి మోడీ డ్రామాలు మొదలు పెట్టారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పే వరకు బిజెపి నేతలను అడ్డుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బిజెపినేతలను రాష్ట్రంలో తిరగనివ్వం అని తేల్చి చెప్పారు. మోడీ క్షమాపణలు చెప్పకుంటే కెసిఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications