టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..!
టీం ఇండియా మహిళా క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన తెలంగాణ యువ క్రికెటర్ అరుంధతి రెడ్డిని.. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్-2025లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమెను మంత్రి అభినందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో అరుంధతికి శాలువ కప్పి సన్మానించారు. తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన అరుంధతి రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ విసి & ఎండి సోనీ బాలదేవి, కోచ్ ఆకాష్, అలాగే ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా అంతకు ముందు దక్షిణాఫ్రికాపై ఫైనల్లో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు సభ్యురాలిగా స్వదేశానికి చేరుకున్న అరుంధతి రెడ్డికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమెను అభినందించారు. తెలంగాణ నుంచి వెలుగొందిన ఈ యువ క్రికెటర్‌పై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ఇటీవల జరిగిన ఉమెన్ వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియాలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘనంగా సన్మానించారు. శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం చంద్రబాబును కలిసి వరల్డ్ కప్ విజయానందాన్ని పంచుకున్నారు. భారత జట్టు విజయంలో తమదైన పాత్ర పోషించినందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందించారు. మహిళా క్రీడాకారిణులు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. మహిళల ప్రతిభకు ఇది చక్కటి నిదర్శనమని, భవిష్యత్తు తరాల క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచారని ఆయన ప్రశంసించారు.
ఇక వీరి భేటీకి ముందు వరల్డ్ కప్ విజయం సాధించిన అనంతరం శ్రీచరణి స్వదేశానికి చేరుకోగా, గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని ఆమెను అభినందించారు.
విజయవంతమైన ప్రదర్శనతో దేశానికి కీర్తి తెచ్చిన శ్రీచరణిపై అభిమానులు, క్రీడాభిమానులు, ప్రజా ప్రతినిధుల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది.












Click it and Unblock the Notifications