ఇది కేసీఆర్ అడ్డా.. బిడ్డా.. మీ ఆటలిక సాగవు: మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించిన ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం బీజేపీ కొనుగోళ్ల ఎపిసోడ్ కు తెర తీసిందని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో బిజెపిపై విరుచుకు పడుతున్నారు. ఇక తాజాగా బిజెపి ని టార్గెట్ చేసిన టిఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసీఆర్ ఒక్కరే అంటూ పేర్కొన్నారు.
దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చౌటుప్పల్ మండలం నాగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం, బిజెపి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరికలు జారీ చేశారు. నాగారం గ్రామంలో ఆందోళనలు నిర్వహించిన టిఆర్ఎస్ నేతలు చావు డప్పులతో, బిజెపి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి బిజెపి నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం కుట్రలకు తెరలేపుతున్నారు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
నిఖార్సయిన తెలంగాణ బిడ్డలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీని ఎదిరించడం వల్లనే ఆయనను బీజేపీ టార్గెట్ చేస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బిడ్డ మీ ఆటలు ఇక సాగవు.. ఇది కెసిఆర్ అడ్డ అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిఖార్సయిన తెలంగాణ బిడ్డలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించిన ఆయన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
కేసీఆర్ దేశ రాజకీయాలను తట్టుకోలేకే కుట్రలు
బీజేపీ నాయకుల కుట్రలను భగ్నం చేసి తెలంగాణ ప్రజలకు వారి నిజస్వరూపాన్ని తెలియజేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మోడీ, అమిత్ షా భారతదేశం వారి జాగీర్ ఐనట్టు వ్యవహరిస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తుంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుందని దీనిని తట్టుకోలేక ఈ కుట్రకు పూనుకున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారని, అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలదోసినట్టు తెలంగాణ రాష్ట్రంలో చేద్దామంటే సాధ్యం కాదని వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కార్పొరేట్ మిత్రులకు 12 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసి, అక్రమంగా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తీవ్రస్థాయిలో వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications