అలా ఐతే బీజేపీ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపే! రాజా సింగ్ సంచలనం
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అధ్యక్ష పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకోవడంతో ఎవరిని వరించేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కొందరు నేతలు పార్టీ అధ్యక్ష పదవిపై అంతర్గత సమావేశాల్లో మాట్లాడుతుండగా.. మరికొందరు మాత్రం బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తున్నట్లు చెప్పారు. కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా, జాతీయ నాయకత్వమా? అని ప్రశ్నించారు. అంతేగాక, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రప్పర్ స్టాంప్‌గానే ఉంటారన్నారు.

పార్టీ కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందన్నారు రాజా సింగ్. గతంలో మనం చూసిన అధ్యక్షుడు గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులను, జైలుకెళ్లిన కార్యకర్తలని గతంలో పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చే పార్టీ అధ్యక్షుడు అదే గ్రూపిజం చేస్తే పార్టీకి నష్టమని, ప్రస్తుతం పార్టీలో మంచి నాయకుల చేతులు కట్టి పడేశారని అన్నారు.
పార్టీలో సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడు సీఎంతో రహస్య భేటీలు నిర్వహించవద్దన్నారు. సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులో మాట బయటపెడుతున్నారన్నారు.
ఇలాంటివి పార్టీ నేతలకు చెప్పాలే తప్ప మీడియాకు చెప్పవద్దని కొందరు చెబుతున్నట్లు తెలిపారు. పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా వినకపోవడం వల్లే ప్రజల ముందు పెట్టాల్సి వస్తుందన్నారు. సీనియర్ నాయకులను బీజేపీ గుర్తించట్లేదని, నామినేటెడ్ పోస్టులను సీనియర్ నేతలకు ఇవ్వడం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications