సీఎం కేసీఆర్ చేసింది దొంగ దీక్ష.. దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చెయ్: కేసీఆర్ కు సీతక్క సవాల్
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి మరీ పోరు బాట పట్టాయి. మొన్నటికి మొన్న బిజెపి తెలంగాణ రథసారథి బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించి ఐకెపి కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
అయితే కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తే తాము కొనుగోలు చేస్తామంటూ పేర్కొన్న తెలంగాణ సర్కార్, ప్రస్తుతం వర్షాకాలం సాగుచేసిన పంటను కొనుగోలు చేస్తున్నామని పేర్కొంది. అయినప్పటికీ కేంద్రంపై ధాన్యం కొనుగోలు విషయంలో సమరం చేస్తామని పేర్కొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా కేంద్రంలో అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిఆర్ఎస్ మహాధర్నా నిర్వహించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం మేము సైతం అంటూ కర్షకుడా కదలిరా అన్న నినాదంతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ తీరుతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడిన సీతక్క టీఆర్ఎస్ మహాధర్నాలో సీఎం కేసీఆర్ దీక్ష లో పాల్గొనడం పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దొంగ దీక్ష చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతన్నలు నష్టపోకుండా వెంటనే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చేస్తున్నవన్నీ దొంగ దీక్షలు అన్న సీతక్క, వడ్ల కొనుగోలుకు పరిష్కారం చూడకుండా దీక్షలకు దిగటం సిగ్గుచేటని తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినప్పుడు మీరు ఏం చేశారని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేయాలంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే సీతక్క. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా ..కెసిఆర్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏడేళ్లుగా బీజేపీతో ఏడు అడుగులు నడిచారని సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వడ్లను కొనకుండా నల్ల చట్టాలను అమలు చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క కెసిఆర్ ను నిలదీశారు. కేసీఆర్ దీక్షలు చెయ్యటం సిగ్గు చేటు అన్నారు ఎమ్మెల్యే సీతక్క.












Click it and Unblock the Notifications