
ఎమ్మెల్యేల కొనుగోళ్ళ ఎపిసోడ్.. రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనాలు; భగ్గుమన్న టీఆర్ఎస్!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు రేపింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం బిజెపి కుట్రలు చేస్తోందని టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి కుటిల యత్నాలపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనల హోరు .. మోడీ దిష్టిబొమ్మల దహనాలు
రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు బిజెపి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో దాదాపు ఎక్కువ మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడు లో ఉండటంతో వారు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మునుగోడు నియోజకవర్గం లోని చండూరు లో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, బాల్క సుమన్ ఆధ్వర్యంలో బిజెపి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా సంగారెడ్డి జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్రంలోని అధికార బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . నిరసనలతో హోరెత్తించారు.

బిజెపి నీచ రాజకీయాలను తిప్పిగొడుతూ ఆందోళనలు చేస్తున్నామన్న టీఆర్ఎస్
ప్రజాస్వామ్య వ్యవస్థని ఖూనీ చేసే విధంగా నిన్న మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలకు అక్రమ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మోసపురితమైన బిజెపి నీచ రాజకీయాలను తిప్పిగొడుతూ నేడు ఆందోళనలు నిర్వహించినట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.

బిజెపి ఆటలు తెలంగాణ రాష్ట్రంలో సాగవన్న టీఆర్ఎస్ నాయకులు
బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా టిఆర్ఎస్ పార్టీ నాయకులను కొనుగోలు చేయలేరని, బిజెపి ఆటలు తెలంగాణ రాష్ట్రంలో సాగవని వారు చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ తరహా కుతంత్రాలను చేస్తున్నారని మండి పడుతున్నారు. బిజెపి హటావో.. దేశ్ కి బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ బీజేపీ ని టార్గెట్ చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు.
టీఆర్ఎస్
ఎమ్మెల్యేల
కొనుగోళ్ళ
ఎపిసోడ్
లో
అంతుచిక్కని
ప్రశ్నలు
ఎన్నో;
రాజకీయవర్గాలలో
ఆసక్తికర
చర్చ!!