ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు సాధన మౌనదీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి బీసీ బిల్లు ఎంత అవసరమో చాటిచెప్పేందుకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అనుమతి లేకపోయినా దీక్ష తప్పదు..
72 గంటల దీక్షకు ప్రభుత్వ అనుమతి కోరినట్టు తెలిపిన కవిత.. అనుమతి రాకపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడే దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం తాను చేపట్టిన దీక్షకు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. బీసీ బిల్లు కోసం దేశవ్యాప్తంగా చైతన్యం అవసరమని, తాను చేపట్టనున్న దీక్ష ఒక మొదటి మెట్టు మాత్రమేనని కవిత స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కొనసాగుతుందని, రాష్ట్రం మొత్తం దానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఇదేమైనా సత్రం భోజనమా?
తాము ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవుతున్నప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు రావాలి అని చెప్పడాన్ని తప్పుబట్టారు. ఇది సత్రం భోజనమా అని విరుచుకుపడ్డారు. అఖిలపక్షం పేరుతో ధర్నా నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని పార్టీలకు లేఖలు పంపించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని వెల్లడించారు.
రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా వారు రిజర్వేషన్ల అంశంలో ఏమీ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీ సీఎం, బీసీ ప్రధాని అంటూ మాట్లాడే బీజేపీకి వాస్తవంగా బీసీలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అంతే కాకుండా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. తమిళనాడులో గవర్నర్ బిల్లుపై జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications