తెరాస నుంచి గెలిచిన వారిలో ఫిరాయించిన వారే ఎక్కువ, కెటిఆర్ సన్నిహితుడు కూడా
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదింటిని తెరాస, రెండింటిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పదింట ఆరింటిని తెరాస ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగతా ఆరింటికి ఎన్నికలు జరగగా.. నాలుగింట గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తెరాసకు షాకిస్తూ రెండు స్థానాల్లో విజయం సాధించింది.
తాజాగా తెరాస నుంచి గెలిచిన ఎమ్మెల్సీల్లో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చి కారు ఎక్కిన వారే. ఖమ్మం జిల్లా నుంచి బాలసాని లక్ష్మీనారాయణ గెలుపొందారు. అతనిపైన పువ్వాడ నాగేశ్వర రావు (సిపిఐ) పోటీ చేయగా.. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి.
అయినప్పటికీ బాలసాని గెలిచారు. ఇతను గతంలో టిడిపి ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఏడాది తెరాసలోకి ఫిరాయించారు. పాలమూరు నుంచి గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డికి విద్యాసంస్థలు ఉన్నాయి. ఇతను కొద్ది నెలల క్రితం తెరాసలో చేరారు.

రంగారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు తెరాస తరఫున గెలిచారు. ఒకరు పట్నం నరేందర్ రెడ్డి, మరొకరి శంభీపుర్ రాజు. నరేందర్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు. అతను గతంలో టిడిపి తరఫున ఎమ్మెల్సీగా పని చేశారు. మహేందర్ రెడ్డి కూడా గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు కూడా.
రంగారెడ్డి నుంచి గెలిచిన మరో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సన్నిహితుడు. ఇతనికి రాజకీయాలు కొత్త అనే చెప్పవచ్చు.
తాజా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు వీరే..
అదిలాబాద్ - పురాణం సతీష్ కుమార్ (తెరాస, ఏకగ్రీవం)
నిజామాబాద్ - భూపతి రెడ్డి (తెరాస, ఏకగ్రీవం)
కరీంనగర్ 1 - భానుప్రసాద రావు (తెరాస, ఏకగ్రీవం)
కరీంనగర్ 2 - నారదాసు లక్ష్మణ రావు (తెరాస, ఏకగ్రీవం)
మెదక్ - భూపాల్ రెడ్డి (తెరాస, ఏకగ్రీవం)
వరంగల్ - కొండా మురళీ (తెరాస, ఏకగ్రీవం)
రంగారెడ్డి 1 - పట్నం నరేందర్ రెడ్డి (తెరాస, ఎన్నికల్లో గెలుపు)
రంగారెడ్డి 2 - శంభీపూర్ రాజు (తెరాస, ఎన్నికల్లో గెలుపు)
మహబూబ్ నగర్ 1 - కసిరెడ్డి నారాయణ రెడ్డి (తెరాస, ఎన్నికల్లో గెలుపు)
మహబూబ్ నగర్ 2 - కూచుకుళ్ల దామోదర్ రెడ్డి (కాంగ్రెస్, ఎన్నికల్లో గెలుపు)
నల్గొండ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్, ఎన్నికల్లో గెలుపు)
ఖమ్మం - బాలసాని లక్ష్మీనారాయణ (తెరాస, ఎన్నికల్లో గెలుపు)












Click it and Unblock the Notifications