హైదరాబాద్ జూపార్క్ లో తెల్లపులి అడాప్ట్
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన నెహ్రూ జూలాజికల్ పార్క్ కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. లాంగ్ వీకెండ్స్, పండగల సీజన్‌ను పురస్కరించుకుని పర్యాటకుల రద్దీ ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో నగరవాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు జూ పార్కుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు.
కాగా.. జూపార్క్ లో ఉండే ఓ తెల్లపులిని అసెట్ ఎన్‌ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ షా దత్తత తీసుకున్నారు. తన కుమారుడు చిన్మయ్ సిద్ధార్థ్ షా 18వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అడాప్ట్ కు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాన్ని నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ మురళీధర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూ మాజీ క్యూరేటర్ శంకరం ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

చిన్మయ్ షా ఇప్పటికే జూపార్క్ లో పలు వన్యప్రాణులను దత్తత తీసుకున్నాడు. అయిదేళ్ల వయస్స ఉన్నప్పుడు నెమళ్లను దత్తత తీసుకోవడంతో అతని వన్యప్రాణి సంరక్షణ ప్రయాణం మొదలైంది. 2020లో తన 12వ పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్‌ను దత్తత తీసుకున్నాడు. 14వ ఏట ఓ ఆఫ్రికన్ చీతాను అడాప్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా తెల్ల పులిని దత్తత తీసుకున్నాడు.
హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో అమలవుతున్న ఈ అడాప్ట్ స్కీమ్.. వన్యప్రాణుల పర్యవేక్షణకు అండగా నిలుస్తోంది. వీటిని దత్తత తీసుకున్న వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు వాటి వార్షిక ఆహారం, వైద్యం, నిర్వహణ ఖర్చులను సొంతంగా భరించాల్సి ఉంటుంది. దీనివల్ల సాధారణ ప్రజలలో సైతం అడవుల ప్రాముఖ్యత, జీవవైవిధ్య సమతుల్యత, వన్యప్రాణుల రక్షణపై విస్తృత అవగాహన మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications
