కేసీఆర్ కే ఏమీ అర్థం కాకుండా ఉంది?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తి, గండర గండడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అంతటి కేసీఆర్ కు కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అవును.. కేసీఆర్‌కు కూడా ఏం చేయాలనేదానిపై పాలుపోవడంలేదు. దీంతో అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణికి వెళ్లిపోయారు.

మనసంతా కూసుకుంట్లవైపే.. కానీ?
టీఆర్ఎస్ తరఫున బరిలోకి దించడానికి కేసీఆర్ మనసు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డివైపు మొగ్గుచూపుతోంది. కానీ ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించే సాహసం చేయలేకపోతున్నారు. ప్రభాకర్ రెడ్డికి సీటిస్తే ఓడిస్తామని పార్టీ నేతలు పలువురు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కొందరు నేతలు నేరుగా కేసీఆర్‌కే చెప్పారు. దీంతో ఎటూపాలుపోని స్థితిలో ఉన్నారు.

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి
మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాడర్‌పై గట్టి నమ్మకంతో బీజేపీలోకి దూకేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ సీటు దక్కించుకున్నప్పటికీ ఆ తర్వాతే ఆయనకు షాక్ తగిలింది. దీంతోపాటు ద్వితీయశ్రేణి నాయకులు పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్నట్లుగా ఇక్కడ కోమటిరెడ్డి తీరు ఉంది.

వలస వచ్చిన నేతలతో కుదరని సఖ్యత
రాజీనామా చేసినప్పుడు ఉన్న ఊపు ఇప్పుడు ఆయనకు కనపడటంలేదు. ప్రచారంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. కోమటిరెడ్డితోపాటు బీజేపీలోకి వచ్చిన నాయకులకు, అప్పటికే పార్టీలో ఉన్న నాయకులకు మధ్య సఖ్యత కుదరడంలేదు. అంతేకాకుండా తనతోపాటు అందరూ బీజేపీలోకి వచ్చేస్తారని భావించిన కోమటిరెడ్డికి వారంతా చాలావరకు షాక్ ఇచ్చారు. వారు పార్టీ మారారు కానీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి జంపింగ్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అంతా అయోమయంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న పాల్వాయి స్రవంతికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి సహకారం అందడంలేదు. అంతకుమించి మిగతా రెండు పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పరిస్థితే కాస్తంత నమయనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.












Click it and Unblock the Notifications