నిజమేనా? కేసీఆర్ సన్నిహితుడు మైహోమ్ రామేశ్వరరావుకు కీలక పదవి!?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా, చిన్నజీయర్ స్వామికి ప్రియ శిష్యుడుగా మైహోమ్ రామేశ్వరరావు రాష్ట్రంలో అందరికి సుపరిచితమే. తాజాగా చిన్నజీయర్ తో కలిసి ఆయన భద్రాద్రి ఆలయాన్ని సందర్శించడం ఓ ఆసక్తికర చర్చకు దారి తీసింది.
భద్రాద్రి ఆలయ అభివృద్ధి నమూనా రూపకల్పనపై చర్చించడానికి సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రత్యేక హెలికాప్టర్ లో చిన్నజీయర్ భద్రాద్రిలో అడుగుపెట్టారు. అయితే చిన్నజీయర్ తో పాటు మైహోమ్ రామేశ్వరరావు కూడా విచ్చేయడం పట్ల పలు కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.
ముఖ్యంగా గత నాలుగేళ్లుగా భద్రాద్రి ఆలయానికి పాలకమండలి లేని దృష్ట్యా.. మైహోమ్ రామేశ్వరరావుకు భద్రాద్రి పాలన పగ్గాలు అప్పగించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోతున్న తరుణంలో.. ఏప్రిల్ 5న శ్రీరామ నవమి, సీతారామ చంద్రస్వామి కల్యాణ వేడుకలు జరిగే నాటికైనా ఆలయ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే తరుణంలో మైహోమ్ రామేశ్వరరావును భద్రాద్రి పాలకమండలి చైర్మన్ గా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది.
మైహోమ్ రామేశ్వరరావు స్వతహాగా రామభక్తుడు కావడం, ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్రముఖులకే పాలకమండలి పగ్గాలు అప్పజెప్పాలని కేసీఆర్ భావిస్తుండటంతో భద్రాద్రి పాలనా పగ్గాలు రామేశ్వరరావు చేతిలోకే వెళ్తాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, భద్రాద్రి ఆలయాన్ని జాతీయస్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలన్నలక్ష్యంతో వంద కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ అభివృద్ధి పనులకు మైహోమ్ రామేశ్వరరావు టెక్నికల్ సపోర్ట్ అందించనున్నారు.












Click it and Unblock the Notifications