యూకే జాబ్స్ పేరుతో మోసం.. పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ నందన
లండన్ లో ఉద్యోగాలు, స్పాన్సర్ షిప్స్ ఇప్పిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రముఖ తెలుగు యూట్యూబర్ రమా నందనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు ఆమెను ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. లండన్ లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నందనపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.
యూకే లో ఉద్యోగాలు, వీసాల పేరిట రూ.15 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆమె గుర్తింపు పొందారు. ఆమె తన భర్త జాగర్లమూడి మధుకర్ ఇద్దరు పిల్లలతో కలిసి లండర్ ఉంటున్నారు. అక్కడి నుంచే ఆమె యూట్యూబ్ కంటెంట్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే వీరిపై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. యూకేలో నివాసం ఉంటున్న మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి వీరిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నందన, మధుకర్ ఆయన తండ్రి మోహన్ రావ్ పై కేసు నమోదైంది.
యూకే వీసా పొడిగింపు, ఉద్యోగం సహాయం, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇప్పిస్తామని మాయమాటలతో నమ్మించి మధుకర్, నందనలకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న డెస్టినీ కన్సల్టెన్సీ బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా రూ.15 లక్షలు బదిలీ చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే డబ్బులు తీసుకున్నాక ఇచ్చిన డాక్యుమెంట్ ఫేక్ అని తేలడంతో బాధితుడు ఇదేంటని నిలదీయగా పలుమార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత కేవలం రూ. 2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగతా రూ. 13 లక్షలు ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్ ను ఏ1 గా, రమా నందనను ఏ 2గా అలాగే మోహన్ రావ్ ను ఏ 3 గా చేర్చారు. మోసం, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వారు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో నందనను తాజాగా ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తమపై వ్యక్తిగత కక్షలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నందన, మధుకర్ దంపతులు గతంలోనే ఓ వీడియో ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
