ఎన్టీఆర్ ఘాట్ ఇలానా..? నారా లోకేష్ అసంతృప్తి, టీటీడీపీ బలోపేతంపై ప్రకటన
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని గమనించారు మంత్రి లోకేష్.
ఈ క్రమంలో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన అనుమతులు తీసుకుని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని తన సిబ్బందిని ఆదేశించారు.

ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఎన్టీఆర్ ట్రస్టుకు అప్పగించాలని పలుమార్లు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు. మరోవైపు, ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్ఎండీఏ తీరు పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక ప్రభంజనం అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజల గుండెల్లో ఆయన స్థానం దేవుడు. నటుడుగా అయినా నాయకుడిగా అయినా ఎన్టీఆర్ గారే నంబర్ 1. తెలుగోడి పవర్ ఢిల్లీ కి చూపించింది ఎన్టీఆర్. ఎస్సి, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం, రూ. 2 కే కిలో బియ్యం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. ఆయన ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది. కోటి సభ్యత్వాలతో ఆయనకు ఘన నివాళులు అర్పించినట్లు లోకేష్ పేర్కొన్నారు.

తెలంగాణలో టీడీపీ బలోపేతం చేస్తాం
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని లోకేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications