హుజీ ఉగ్రవాద సంస్థలో కీలకపాత్రధారి నజీర్: భార్యతో హైదరాబాదులో తిష్ట
హైదరాబాద్: హైదరాబాదులోని చంచల్‌గుడా ప్రాంతంలో అరెస్టు చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో నజీర్ హుజీ సంస్థలో కీలక పాత్రధారి అని పోలసులు గుర్తించారు. చంచల్‌గూడ ప్రాంతంలో ఆరుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే.
ఈ ఆరుగురిలో ఒకరు పాకిస్థాన్, మిగతా ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు నగరంలో వీరికి ఆశ్రయం కల్పించారు. మొత్తంగా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ నజీర్ ఐదేళ్లుగా భారత్‌లో ఉండి పాకిస్థాన్‌లో ఉన్న హుజీ ప్రధాన నాయకుడు జబ్బర్ ఆదేశాలతో హుజీ ఉగ్రవాద సంస్థ తరపున పని చేస్తున్నట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్‌రావు తెలిపారు.

దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల నిందితుడు వకాస్ అలియాస్ సోనును ఇండియా నుంచి పాకిస్థాన్‌కు పంపడంలో నజీర్ కీలక పాత్ర వహించారని చెప్పారు. గత మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో 15 మందిని నజీర్ దొంగ పాస్‌పోర్టులతో విదేశాలకు పంపించాడు. నజీర్‌తో పాటు మిగతా నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.
దొంగ పాస్‌పోర్టుల తయారీలో నజీర్‌కు సహకరించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌పై, కానిస్టేబుల్‌పై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. వీరిద్దరిపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేయనున్నారు. నజీర్ నుంచి సిమ్‌కార్డులు, 100 ఆధార్‌కార్డులు, మూడు ఇండియన్ పాస్‌పోర్టులతో పాటు బంగ్లాదేశ్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నజీర్ తన భార్యతో నగరంలో నివాసం కొనసాగిస్తున్నాడు.












Click it and Unblock the Notifications