తెలంగాణలో కొత్త చట్టం: ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10% కోత?
తెలంగాణలో మరో విడత ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తయింది. గ్రూప్- 2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. కొత్తగా నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. వారి బాధ్యతల గురించి వివరించార.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్ల నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తోన్నామని, ఇందులో భాగస్వామ్యులు కావాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ బాధ్యత గ్రూప్-2కు ఎంపికైన అభ్యర్థులందరిపైనా ఉందని, అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. దీపావళి పండుగ శుభవేళ ఉద్యోగ నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

తెలంగాణను బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ - 2047 లక్ష్యాలను నిర్ధేశించామని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-2 లో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని చెప్పారు. మనిషి జీవితంలో జన్మదినం ఎంత ముఖ్యమైనదో.. ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రం అందుకోవడం కూడా అంతే ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ఇప్పటినుంచి బాధ్యత కలిగిన అధికారులు అని గుర్తుచేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును భద్రంగా కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
ప్రభుత్వ అధికారులుగా ఉద్యోగంలో చేరడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భూజాన మోసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరిని అభివృద్ధి చేసుకోవడం మీ బాధ్యత అని సూచించారు. ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందించాలని అన్నారు. నిస్సహాయులకు అండగా సహాయం అందించడమే బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చెప్పారు.
ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీతం నుంచి 10 శాతం కోత పెట్టి నేరుగా వారి ఖాతాల్లో వేసేట్టుగా చట్టం చేయబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పునరుద్ఘాటించారాయన. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించామని, దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన పూర్తి చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications