రాజగోపాల్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ - రాహుల్ పిలుపు : రాజీనామా - బై పోల్ పై..!!
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన లక్ష్యాలను వివరిస్తూ తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక లేఖ విడుదల చేసారు. రాజగోపాల్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైందనేది ఆ లేఖ ద్వారా స్పస్టం అవుతోంది. కేసీఆర్ లక్ష్యంగా రాజగోపాల్ ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో రాజగోపాల్ పైన సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ వీడవద్దంటూ పార్టీలోని ఆప్తుల ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం రాయబారం నడుపుతోంది.

రాజగోపాల్ పై పెరుగుతున్న ఒత్తిడి
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వంశీచంద్ రెడ్డి తాజాగా రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీకి రావాలని కోరారు. రాహుల్ గాంధీతో భేటీ అవ్వాలని సూచించారు. కానీ, రాజగోపాల్ మాత్రం ఢిల్లీకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రేపటి నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పర్యటిస్తున్నారు.
ఇప్పటికే కీలక నేతలు..అనుచరులతో సమావేశమైన రాజగోపాల్ వారి అభిప్రాయాలను సేకరించారు. అయితే, రాజగోపాల్ కు ఇప్పుడు రాజీనామా అంశంలో తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బీజేపీలో చేరాలంటే ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికకు సిద్దం కావాలని.. తిరిగి గెలిపించుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు హామీ ఇస్తున్నారు.

రాజీనామా పైనే తర్జన భర్జన
అయితే, అనుచరులు.. నియోజకవర్గంలోని ముఖ్య నేతలు మాత్రం అందుకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించటం లేదని సమాచారం. దీంతో..రాజగోపాల్ రాజీనామా విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. మునుగోడు ప్రజలు కోరుకుంటే ఉప ఎన్నిక వస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక గురించి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. మునుగోడు బై పోల్ కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్య యుద్దంగా రాజగోపాల్ అభివర్ణించారు. 15 రోజుల్లోగా ఉప ఎన్నిక పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త నినాదంతో ఉప ఎన్నిక దిశగా
బీజేపీ కోరుతున్నట్లుగా రాజీనామాకు రాజగోపాల్ సిద్దంగా ఉన్నా..ఇప్పటి వరకు తనతో ఉన్న వారి పూర్తి ఆమోదం లేకుండా ఎన్నికల బరిలో దిగటం పైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో.. మునుగోడులో పర్యటన పూర్తయిన తరువాతనే రాజీనామా విషయంలో రాజగోపాల్ రెడ్డి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆయన పైన మరింత ఒత్తిడి పెంచే వ్యూహాలను అమలు చేస్తోంది. అటు బీజేపీ మాత్రం మరోసారి బై పోల్ ద్వారా టీఆర్ఎస్ కు సవాల్ విసరాలని భావిస్తోంది. దీంతో..ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అడుగులు మరింత ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications