NH-65 కు మహార్దశ.. ఇక 8 లైన్లుగా .. ఆ నెల నుంచే పనులు ప్రారంభం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. జాతీయ రహదారి 65 ప్రస్తుతం 6 లైన్ల రహదారిగా ఉండగా దాన్ని 8 లైన్లుగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్ హెచ్ 65 విస్తరణ పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించి జనవరి నెలలో విస్తరణ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తాజాగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
అక్టోబర్ 4 న చిట్యాల మండలంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే ఎలాంటి అలైన్ మెంట్ జరగలేదని.. రైతులు దీనిపై అపోహలు పెట్టుకోకుండా ఉండాలని తెలిపారు. దివిస్ కంపెనీ కోసం మార్పులు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబరులో అలైన్ మెంట్ పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి మండలిలో చర్చించి గ్రామ సభల ద్వారా రైతులను ఒప్పించి పనులు ప్రారంభిస్తామన్నారు.
జాతీయ రహదారి 65 విస్తరణ పనులకు సంబంధించి డిసెంబర్ నెలలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆ తర్వాత జనవరిలో విస్తరణ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ జాతీయ రహదారిని 6 లైన్ల నుంచి 8 లైన్లుగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రహదారి పక్కన ఆనుకొని ఉన్న గ్రామాలు, పట్టణాలకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయవచ్చని స్పష్టం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కందిమల్ల శశిపాల్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

భారత్ లోని ప్రముఖ జాతీయ రహదారుల్లో NH-65 ఒకటి. ఈ రహదారి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉంది. ఈ రహదారి ఏపీలోని మచిలీపట్నం వద్ద ముగుస్తుంది. ఈ జాతీయ రహదారి పూణే, సోలాపూర్, హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ, మచిలీపట్నం లాంటి ప్రధాన నగరాలను కలుపుతోంది.












Click it and Unblock the Notifications