సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన లాఠీఛార్జ్, తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) బుధవారం నోటీసులు జారీ చేసింది.
డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు.. ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం, పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కుమారుడైన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సదరు ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. సంధ్య థియేటర్ ఘటనపై సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసుల్లో పేర్కొంది.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడు చికిత్స స్పందిస్తున్నాడని వైద్యులు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నాడని చెప్పారు.
మరోవైపు, రేవతి కుటుంబానికి సినీనటుడు అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు రూ. 50 లక్షలు, పుష్ప-2 నిర్మాతలు రూ. 50 లక్షలు సాయం ప్రకటించారు. బాలుడి వైద్య ఖర్చులు భరిస్తామని ప్రభుత్వం చెప్పింది. మరోవైపు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుమారుడి పేరుపై ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలను రేవతి కుటుంబానికి అందజేశారు.












Click it and Unblock the Notifications