ఉగ్రవాద కార్యకలాపాలు: సంజయ్ దీపక్ రావు కేసులో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత సంజయ్ దీపక్ రావు కేసుకు సంబంధించి హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సంజయ్ ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. మలేషియా టౌన్ షిప్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల సమయంలో నకిలీ ఆధార్ కార్డులు, ల్యాప్‌టాప్, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా జనవరి నెలలో ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. యువకులను సంజయ్ దీపక్ రావు మావోయిస్టు దళంలో చేర్పిస్తున్నట్లు ఎన్ఐఏ తమ దర్యాప్తులో గుర్తించింది. అంతేగాక, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు కూడా సమర్పించినట్లు గుర్తించామని అధికారులు ఛార్జ్ షీట్లో తెలిపారు. పడమటి కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కోసం ఉగ్రవాద క్యాంపులు నిర్వహించినట్లు వెల్లడించారు.

పోలీసుల అదుపులో ప్రణీత్ రావు
ఫోన్ ట్యాపింగ్, విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్లు తెలిసింది. ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు తోపాటు ఇతరులపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications