తెలంగాణలో 5 జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు... భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
తెలంగాణలోని ఐదు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మహబూబ్‌నగర్,వరంగల్,జనగామ,యాదాద్రి,మేడ్చల్ జిల్లాల్లోని పలువురి ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌లో ముత్తు నాగరాజు,సతీశ్ ఇళ్లల్లో,మేడ్చల్‌లో కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపుస్వామి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు,ఐఈడీ,గ్రెనేడ్ లాంఛర్లు,400 జిలెటిన్ స్టిక్స్,ఫ్యూజ్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నేతలకు వీటిని సప్లై చేసేందుకు సిద్ధం చేసినట్లుగా తెలిపారు.పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు డాక్యుమెంట్స్ కూడా వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఒకప్పుడు తన ప్రాబల్యాన్ని చాటుకున్న మావోయిస్టు పార్టీ క్రమంగా ఉనికిని కోల్పోతున్న పరిస్థితి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇటీవలే మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్‌గా ఆయన వ్యవహరించారు.రంజిత్ లొంగుబాటు సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి... తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు స్థానం లేదని.. అందరూ లొంగిపోవాల్సిందేనని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని... వారంతా లొంగిపోవాలని డీజీపీ సూచించారు. వీరిలో 11 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మరో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ మావోయిస్టు కమిటీలో 120 మంది సభ్యులున్నారని... తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జ్ సెక్రెటరీగా దామోదర్ కొనసాగుతున్నాడని తెలిపారు. వారంతా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని... లొంగిపోయిన వారికి రూ.4 లక్షల పరిహారంతో పాటు ప్రస్తుత ఖర్చులకు రూ.5 వేలు అందజేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications