200కోట్ల స్కామ్‌లో నిమ్మగడ్డ వాణి బాల ఫ్యామిలీ అరెస్ట్.. అసలు ఎవరీ వాణి బాల!!
అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి తనతో పాటు పనిచేసే ఉద్యోగులు మరియు తెలిసిన వ్యక్తుల నుంచి సేకరించి 200 కోట్ల రూపాయలు మోసానికి పాల్పడి, బోర్డు తిప్పేసిన కేసులో టెస్కాబ్ మాజీ జిఎం నిమ్మగడ్డ వాణి బాల, శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్స్ వ్యవస్థాపకుడు అయిన ఆమె భర్త మేక నేతాజీ, ఆయన కుమారుడు శ్రీహర్ష ను హైదరాబాద్ నగర సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అధిక వడ్డీలు ఆశ చూపి 200 కోట్ల సేకరణ
అసలు ఎవరీ వాణి బాల? ఆమె ఏం చేశారు? వంటి వివరాల్లోకి వెళితే తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన వాణి బాల, బ్యాంకు జనరల్ మేనేజర్ పదవిని అడ్డుపెట్టుకొని అబిడ్స్ లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో అధిక వడ్డీలు ఇస్తామని 517 మంది డిపాజిటర్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు.

డిపాజిటర్లకు కుచ్చు టోపీ
ఇక ఆమె మాత్రమే కాదు, ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు శ్రీ హర్ష కూడా డిపాజిట్లు సేకరించారు. ప్రతి నెల 24 శాతం రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికారు. మొదట్లో కొందరికి బాగానే వడ్డీ చెల్లించిన వాణీ బాల, ఆపై డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టారు. శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్స్ బోర్డు తిప్పేసి వాణి బాల ఫ్యామిలీ పరారయ్యారు.
కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు
దీంతో తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక వాణి బాల బాధితులంతా తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ లోని సిసిఎస్ పోలీసులను ఆశ్రయించగా, సిసిఎస్ పోలీసులు వాణి బాల చిట్ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పై కేసు నమోదు చేశారు.
వాణిబాల ఫ్యామిలీ అరెస్ట్
మొత్తం ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ పోలీసులు 200 కోట్ల స్కామ్ జరిగినట్టుగా గుర్తించి ప్రధాన నిందితురాలైన నిమ్మగడ్డ వాణి బాలతో పాటు, ఆమె భర్తను, కొడుకును అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తే అసలు ఈ దందాలో ఏం చేశారు? ఆ డబ్బంతా ఎటు పోయింది? అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications