నిమ్స్ విస్తరణ పనులు, ఉస్మానియా నూతన భవన నిర్మాణ పనులపై కీలక అప్డేట్!
తెలంగాణా రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు, ఇప్పటికే ఉన్న ఆస్పత్రుల విస్తరణ పనులు, నూతన భవన నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా నిమ్స్ ఆస్పత్రి విస్తరణా ప్రాజెక్ట్, గోషామహల్లో నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులపై కీలక అప్డేట్ వచ్చింది.
నిమ్స్ ఆస్పత్రి విస్తరణ, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై తాజాగా సెక్రటేరియట్లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణ పనుల పురోగతి, తదుపరి చేపట్టాల్సిన పనులపై మంత్రి అధికారులతో చర్చించారు. గోషామహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు 23 శాతం పూర్తయ్యాయని, నిమ్స్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్‌లో భాగంగా భవన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ రెండు ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయని ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు ముందుకు సాగేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.
వివిధ శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తూ, నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్యరంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు.
కీలకమైన ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుండి నగరాల వరకు అందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని అన్నారు.













Click it and Unblock the Notifications
