బనకచర్ల పైనేకాదు.. వాటికోసం చంద్రబాబుతో ఢీ, తగ్గేదేలేదన్న సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కొనసాగుతున్న రగడ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణా ప్రాజెక్ట్ లకు నీటి కేటాయింపులు జరిగాకే మిగులు, వరద జలాల మాట
తెలంగాణలో నిర్మాణమవుతున్న నీటి ప్రాజెక్టులకు పక్కాగా నీళ్ల కేటాయింపులు జరిపిన తర్వాత మిగులు, వరద జలాలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగులు, వరద జలాలలోను రెండు రాష్ట్రాల మధ్య నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గోదావరి కృష్ణా బేసిన్ జలవివాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇక గోదావరి కృష్ణ బేసిన్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా అన్న అంశం పైన పూలే ప్రజా భవన్ లో ప్రజాప్రతినిధులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలను, జల వివాదాలపైన జరిగిన చారిత్రక పరిణామాలను తెలుసుకున్నారు.
కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి జిల్లాలలో తెలంగాణ హక్కులను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సమగ్రంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక దీనిపైన మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు మధ్య కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారు.
ఆ పని చేస్తేనే ఏపీ, తెలంగాణా నీటి పంచాయితీకి చెక్
తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు పక్కాగా నీటి కేటాయింపులు జరిపినప్పుడే జల వివాదాలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కృష్ణ గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర శాశ్వత హక్కుల కోసం ముందుకు వెళ్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఏపీ ఆ ప్రాజెక్ట్ లపై ఎందుకు అభ్యంతరం చెప్తోంది
ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చ జరగాలని ఈ విషయాల పైన తేలకపోతే అపెక్స్ కమిటీ ఉంది, చర్చించి పరిష్కరించుకోవాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వివాదాల పైన కేంద్రం పైన ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటి కేటాయింపులతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఒకవైపు అభ్యంతరాలు, మరోవైపు ఏపీ నిర్మాణాలు
ఒకవైపు తెలంగాణ నికర జలాలపై అభ్యంతర పెడుతూ మరో వైపు మిగులు జలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నదో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణ గోదావరి జలాలలో తెలంగాణ హక్కుల కోసం సాంకేతిక అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయ అంశాలను ప్రజల ముందు, న్యాయపరమైన అంశాలను న్యాయస్థానాలలో పోరాటం చేస్తామన్నారు.
ఏపీపై జల వివాదాల నేపధ్యంలో సమరానికి సిద్ధమైన రేవంత్
ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మొత్తంగా కృష్ణ గోదావరి జలాల విషయంలో ఏపీ పై సమరానికి సన్నద్ధమైనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications