తుపాను ఎఫెక్ట్: 'నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం'
మొంథా తుపాను ధాటికి తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది. తుపాను కారణంగా రాష్ట్రంలోని 4,47,864 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పంట నష్టం భారీగా ఉన్నట్లు తేలింది. పంట నష్టం వివరాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడించింది. ఇక నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. మొంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని అన్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై ప్రాథమిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికలో వివరాలు వెల్లడించారు.
నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లోని 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు సంబంధించిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో సర్వే చేశాక పంట నష్టం విలువ మరింత పెరగొచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాలు దెబ్బతిన్నాయని.. అలాగే ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాలు ధ్వంసం అయినట్లు తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8 గంటలలోపు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30- 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications