పదవీ విరమణ వయసు పెంపుపై టీ సర్కారు క్లారిటీ, 7న భారీ ప్రకటన
Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే అంశంపై తెలంగాణ సర్కారు స్పష్టతనిచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మంత్రి మాట్లాడారు.
ఫిబ్రవరి 7న ఐటీకి సంబంధించిన భారీ ప్రకటన ఉండబోతోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డ్రైపోర్టు లింక్ పరిష్కారమైందన్నారు. తెలంగాణలో రెండు డ్రైపోర్టులు వస్తాయన్నారు. దీనిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారని మంత్రి తెలిపారు. టైర్ 2 సిటీల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

ఐటీకి సంబంధించి ఈస్ట్ సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. చర్లపల్లి వద్ద పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ఐటీ పాలసీని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పాలసిని తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఐటీని అభివృద్ధి చేయబోతున్నట్లు వివరించారు. నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.
పదేళ్లలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడులకంటే.. ఈ ఏడాదిలోనే అధికంగా వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వీటిని గ్రౌండ్ చేయడంపై దృష్టి సారించామన్నారు. హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మంత్రులు ఎవరూ కూడా అలక, అసంతృప్తిలో లేరని.. ఆర్థిక పరిస్థితిపై అందరికీ అవగాహన ఉందన్నారు. అవినీతి ఆరోపణల్లో నిజం లేదన్నారు.
కాగా ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనదేశంతోపాటు ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు రాబట్టినట్లు సర్కారు చెబుతోంది. త్వరలోనే ఈ పెట్టుబడులు కార్యరూపంలోకి వస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications