హైదరాబాద్ కు కొత్త అందాలు - ఐకానిక్ నిర్మాణాలు, ఇంద్రభవనం మరిపించేలా..!!
హైదరాబాద్ కొత్త అందాలతో శోభిల్లుతోంది. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ లో ఇప్పుడ ఐకానిక్ నిర్మాణాలు నగర ప్రతిష్ఠను మరించ పెంచుతున్నాయి. సాగరతీరం రూపు రేఖలే మారిపోతున్నాయి. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సాగర తీరం కొత్త రూపు సంతరించుకుంటోంది. 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఇప్పటికే రికార్డు సాధించింది.
26.98 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన సచివాలయం ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. హుస్సేన్‌సాగర్ జలాల్లో నూతన సచివాలయం ప్రతిబింబం స్పష్టంగా కనిపించేలా నిర్మాణం జరిగింది. ఈ నెల 30న ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. హైదరాబాద్ నగర నడి బొడ్డున భాగ్యనగరం కీర్తి కిరీటంలో ఈ నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చి దిద్దుతున్నారు.

సాగరతీరంలో ఐకానిక్ నిర్మాణాలు:తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే విధంగా నిర్ణయాలు అమలు చేస్తోంది. మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారుతోంది. ఇటు ఫ్లై ఓవర్లు..కేబుల్ వంతెనలు, విమానాశ్రయం వరకు ఏయిర్ మెట్రో సర్వీసులు..నిరంతర విద్యుత, మంచి నీటి సరఫరాలో గతంతో ఇప్పటి హైదరాబాద్ కు పోలికే లేదు.
ఇదే సమయంలో హైదరాబాద్ అందానికి కేరాఫ్ చిరునామా అయిన హుస్సేన సాగర తీరం ఇప్పుడు ఐకానిక్ నిర్మాణాలకు కేంద్రంగా మారుతోంది. సాగర తీరంలో, సచివాలయం ముందున్న లుంబినీపార్కు, ఉత్తర భాగంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ ఆ పక్కనే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం, లుంబినీ పార్కు పక్కనే నిర్మాణంలో అమరవీరుల స్థూపం ప్రారంభం అయితే కొత్త రూపు రేఖలు సంతరించుకోనుంది. ఇలా అన్నింటి రూపురేఖలను సమూలంగా మార్చేస్తున్నాయి.
ఇంద్రభవనంలా సచివాలయం:సాగర తీరంలో ఆవిష్కృతమైన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఈ విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 146.50 కోట్లను ఖర్చు చేసింది. ఈ విగ్రహం కొత్త రికార్డులను లిఖించింది. ఇక, తెలంగాణ నూతన సచివాలయం రాష్ట్రానికి గుర్తింపు చిహ్నంగా నిలిచిపోయే విధంగా నిలిచిపోయేలా నిర్మాణం దాదాపు పూర్తి చేసారు. సచివాలయం ప్రాంగణం మొత్తం విస్తీర్ణం 26.98 ఎకరాలు.
బడ్జెట్ లో సచివాలయం కోసం రూ 610 కోట్లు కేటాయించారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా హైదరాబాద్‌లో ఈ నిర్మాణం పూర్తయింది. మధ్యలో భవనం పైన ఐదు అంతస్థుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. 150 ఏళ్లు నిలిచేలా, ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేసారు.నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ ఆలయం స్ఫూర్తిగా సచివాలయం నిర్మాణం సాగుతోంది. భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేస్తోంది. తూర్పు, పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేసారు.
సచివాలయంలో తిరుపతి శిల్పాలు :నూతన సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయస్వామి, సింహ, నంది విగ్రహాలతో పాటు శివలింగం తదితర రాతి శిల్పాలు తయారు చేసి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని కోరింది. టీటీడీ శిల్ప కళాశాల ప్రాంగణంలో సంబంధిత దేవతా మూర్తుల శిల్పాలు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. దీనికోసం తమిళనాడులోని కంచి ప్రాంతంలో లభ్యమయ్యే కృష్ణశిలలను తెప్పించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు నిర్మాణం పరిశీలించి పలు సూచనలు చేసారు. ఈ నెల 30న సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తంగా ఖరారు చేసారు. హైదరాబాద్ చరిత్రలో కేసీఆర్ సారధ్యంలో ప్రారంభమైన 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహం..ప్రారంభం కానున్న నూతన సచివాలయం చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత గా విశ్వ వ్యాప్తం చేయనున్నాయి. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నూతన అద్భుతమైన సాగర తీరం ఆవిష్కృతం కానుంది.












Click it and Unblock the Notifications