Breaking: అల్లు అర్జున్ ఇంటిపై దాడి-ఓయూ జేఏసీ ముట్టడి..!
పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట, ఓ మహిళ మృతి, దీనిపై పోలీసుల కేసు, అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, బెయిల్ పై విడుదల కావడం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు, దానికి అల్లు అర్జున్ ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జుబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ఇవాళ ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వారు. అనంతరం ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు ఇవాళ చేసిన రాళ్ల దాడిలో ఇంటి ఆవరణలోని పూలకుండీలు ధ్వంసం అయ్యాయి. ఇంటిపైకి రాళ్లతో పాటు ఆకతాయిలు టమాటాలు కూడా విసిరినట్లు తెలుస్తోంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకుని ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని దాడిపై ఆరా తీశారు.
ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు, జైలు ఘటనల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సీరియస్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు వరుసగా సంధ్య థియేటర్ ఘటన వీడియోలు బయటపెట్టడంతో పాటు ప్రెస్ మీట్లు కూడా పెట్టి వివరణలు ఇస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఏ పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications