పాలమూరు ఖుష్ హువా..! జిల్లా ప్రజల దాహం తీర్చిన కేసీఆర్..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తీర్చడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం చంద్రశేఖర్ రావు అభ్యర్థించారు.

చంద్రశేఖర్ రావు అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం చంద్రశేఖర్ రావు కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని చంద్రశేఖర్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి జూరాలకు నీటి సరఫరా ప్రారంభం కానున్నది.












Click it and Unblock the Notifications