తుపాకితో పట్టుబడిన పరిటాల రవి హత్య కేసు నిందితుడు, బెదిరించేందుకే
మెదక్: తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న మెదక్ జిల్లా నంగునూరు మండలం వెల్కటూరుకు చెందిన బత్తిని వెంకటస్వామిని పోలీసులు శనివారం నాడు అరెస్టు చేశారు.
కొండపాక మండలం కొమురవెల్లి గేటు వద్ద వాహనాల తనిఖీల సందర్భంగా పట్టుకున్నట్లు తొగుట పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లాలో ఇటీవల తుపాకులు కలిగి ఉన్న నిందితుల అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా 9ఎంఎం తుపాకీతో పాటు మూడు తూటాలతో వెంకటస్వామి పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు.

వెంకట స్వామి టిడిపి నేత పరిటాల రవి హత్య కేసులో ఏ 17 నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆ కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవించి బెయిల్ పైన బయటకు వచ్చాడని పోలీసులు చెప్పారు. అనంతరం సొంత గ్రామంలో కల్లు దుకాణం నిర్వహించాడు.
సిద్దిపేట ప్రాంతంలో భూమి సెటిల్మెంట్లు చేసిన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బెదిరింపులకు దిగేందుకు తుపాకీ కోసం కాన్పూరు వెళ్లి అక్కడ సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రెండు తుపాకులు కొన్నాడు. ఒకటి తన వద్ద ఉంచుకొని, మరొకటి వేరే వారికి అమ్మేశాడు. అతని వద్ద తుపాకీ కొనుగోలు చేసిన వారు అంతకుముందే పోలీసులకు పట్టుబడ్డారు.












Click it and Unblock the Notifications