వకీల్ సాబ్ అఖండ విజయం సాధించాలి: దుబ్బాకలో పవన్ కళ్యాణ్
సిద్దిపేట: తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గా ల ప్రజలకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదన్నారు.
వకీల్ సాబ్ అఖండ విజయం సాధించడానికి జనసేన కార్యకర్తలు.. అభిమానులు సైనికుల్లా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో 2009లో ప్రజా యుద్ధనౌక గద్దర్ నిర్వహించిన తెలంగాణ పోరాటంలో తాను పాల్గొన్నానని గుర్తు చేశారు. బీజేపీ 21 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం హర్షనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే తెలంగాణ రాష్ట్ర పునర్ జన్మనిచ్చిందని వ్యాఖ్యానించారు.
దుబ్బాక నియోజకవర్గంలో శ్రీ రఘునందన్ రావు గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను - శ్రీ పవన్ కళ్యాణ్ గారు ( దుబ్బాక బహిరంగ సభలో ) @JanaSenaParty @PawanKalyan pic.twitter.com/Ahifx9j9ro
— Prasannakumar Nalle (@PrasannaNalle) November 23, 2023
బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు పవన్ కళ్యాణ్. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ చెప్పిందని.. అంతేగాక, ఎక్కువ టికెట్లను కూడా బీజేపీనే బీసీలకు కేటాయించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భాగం కాబట్టే తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications